- పురాతన వస్తువుల సేకరణలో గంగాధర్ మేటి
- వృత్తి టీచర్.. ప్రవృత్తి పాత వస్తువుల సేకరణ
-------
శతాబ్దం కిందట చెక్క ఫ్యాన్ ఉండేదా.?
కిరోసిన్‌తో ఫ్యాన్ తిరుగుతుందా.?
అప్పట్లో అన్నం తినేందుకు అంత పెద్ద కంచమా.?
నేచురల్‌గా ప్రెసర్ కుక్కర్ పనిచేసేదా.?
సైకిల్ తొక్కాలంటే లైసెన్స్ ఉండాలా.?
ఇలాంటి వింతలు.. విడ్డూరాలు.. మనం చూడని.. మనకు తెలియని ఎన్నో వస్తువులు.. కళ్లు చెదిరే కళాఖండాలు.. అబ్బురపరిచే చిత్రాలెన్నో అక్కడ దర్శనమిస్తాయి. వీటిని చూడాలన్న ఉత్సుకత.. తెలుసుకోవాలన్న జిజ్ఞాస ఉంటే పరవాడ వెళ్లాల్సిందే.. వృత్తిరీత్యా ఉపాధ్యాయుడైన కోరుపోలు గంగధారరావు తన ఇంటినే కళాఖండాల మ్యూజియంగా మార్చాడు. అహర్నిశలు శ్రమించి దాన్ని ఓ భాండాగారంగా తీర్చిదిద్దాడు. చరిత్ర, సంస్కృతి, సంప్రదాయాలపై మక్కువే తనను ఇక్కడకు తీసుకొచ్చాడంటాడు. ఇందుకోసం ఖర్చుకు వెనుకాడలేదు. శ్రమ అనుకోలేదు. ఒక్కొక్కరికి ఒక్కో రకమైన అభిరుచి ఉంటుంది. కొందరికి వస్తు సేకరణపై ఆసక్తి ఉంటుంది. మరికొందరు నాణేలు సేకరిస్తారు. స్టాంపులు సేకరించే వారు ఇంకొందరు. ఈయన మాత్రం మిగతా వారి కంటే భిన్నం. మానవ జీవన విధానంలో భాగమైన అన్ని వస్తువులు ఈయన మ్యూజియంలో కనిపిస్తాయి.
ఉమ్మడి విశాఖ జిల్లాకు పరవాడకు చెందిన గంగాధరరావు బర్నికం శివారు బపాడుపాలెం ప్రాథమిక పాఠశాలలో ఉపాధ్యాయుడిగా పని చేస్తున్నారు. పిల్లలకు పాఠాలు చెబుతున్న సమయంలో పుస్తకాల్లో ఉన్నది చెప్పడంతో పాటు వాటిని ప్రత్యక్షంగా చూపించాలనే ఆలోచన వచ్చింది. అదే సమయంలో తన ఇంట్లో అల్యూమినియం, రాగి నాణేలు లభించాయి. ప్రత్యేకంగా ఉండడం చూసిన ఆయన నాణేలు, కరెన్సీ నోట్లను సేకరించడం ప్రారంభించారు. 22 ఏళ్ల కిందట వీటి సేకరణపై ఏర్పడిన ఆ ఆసక్తి తర్వాత యజ్ఞంలా మారింది. సేకరించిన నాణేలు, కరెన్సీ నోట్లతో కళాశాలలు, స్కూళ్లు, గ్రంథాలయాల్లో ప్రదర్శనలిచ్చేవారు. ఈ క్రమంలో మోస్ట్ కలెక్షన్ ఆఫ్ వెరైటీ టెన్ రూపీస్ కాయిన్స్ అంశంపై ఇండియన్ బుక్ ఆఫ్ రికార్డ్స్, లార్జెస్ట్ కలెక్షన్ ఆఫ్ కాయిన్స్ అంశంలో మూడు సార్లు లిమ్కా బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో ఆయన పేరు లిఖితమైంది. 2017లో ఆయన గిన్నీస్ బుక్ ఆఫ్ రికార్డ్స్‌కు కూడా దరఖాస్తు చేశారు. తదానంతరం పరిణామాలతో ఆయన ఆలోచనలో మార్పు వచ్చింది. కనుమరుగైపోతున్న వస్తువులను ఈ తరానికి చూపించాలన్న సంకల్పం తోడైంది. వెంటనే అ‘పాత’ మధురాలను సేకరించేందుకు సిద్ధమయ్యారు. ఇప్పుడు ఆయన ఇల్లు చూస్తే.. ఓ మ్యూజియంలా దర్శనమిస్తుంది. రాజులు, జమీందార్లు, బ్రిటిష్ కాలం నాటి అంటే 100 నుంచి 300 ఏళ్ల క్రితం నాటి వస్తువులు ఆయన సేకరించిన వాటిలో ఉన్నాయి. అప్పట్లో వాడిన కంచు గ్లాసులు, కంచు గిన్నెలు, వంట పాత్రలు, గిన్నెలు, గంగ చెంబులు, గోకర్ణాలు, గ్రామఫోన్ల రికార్డులు, ఇత్తడి కిరోసిన్ దీపాలు, బుడ్డీలు, లాంతర్లు, పాత రేడియోలు, బ్లాక్ అండ్ వైట్ టీవీలు, కర్ర గరిటెలు, డోకులు, మజ్జిగ కల్లాలు, వంట పాత్రలు, అడ్డెడు గిన్నెలు, చోల, మానిక తదితర వస్తువులు, బ్రిటిష్ కాలం నాటి ఇత్తడి కొలత పాత్రలు, నాలుగు సేర్లు, 1 సేరు, 1/2 సేరు, 1/4 సేరు, 1/8 సేరు, 1/16 సేరు, 1/32 సేరు, పాత న్యూస్ పేపర్లు, పందిరి మంచం, భోషణం, రంగం పెట్టెలు.. ఇలా 2000పైనే ఆయన సేకరించి భద్రపరిచారు. ఇత్తడి, రాగి పాత్రల్లో ఆహార పదార్థాలను వండి తినడం వల్ల అప్పటి ప్రజలు ఆరోగ్యంగా ఉండే వారని మాస్టారు చెబుతున్నారు. పాత్రలు, కంచాలు వంటివి తయారీలో వాడిన రాగి, ఇత్తడి, కంచు, తగరం లోహాలు ఆరోగ్యానికి మేలు చేసేవిగా ఉండేవని వివరిస్తున్నారు. ఇక ఆయన సేకరించిన భోజనం చేసే కంచు గిన్నెలు ఒక్కొక్కటి 5 కిలోల 500 గ్రామలు బరువు ఉండటం విశేషం. అప్పట్లో ఇళ్లలో అలంకరణ వస్తువులు, పిల్లల ఆట వస్తువులను చెక్క, ఇత్తడితో తయారు చేసేవారు. ఆ వస్తువులను సైతం ఆయన సేకరించారు.
ఆయన సేకరణలో మచ్చుకుకొన్ని..
చెక్క ఫ్యాన్ : దాదాపు 150 ఏళ్ల చరిత్ర ఉన్న చెక్క ఫ్యాన్‌కు పేటెంట్ కూడా ఉంది. బ్రిటిష్ కాలంలో ఈ ఫ్యాన్‌ను వినియోగించేవారు. ఇందుకోసం ఫంకా మ్యాన్ అనే ఉద్యోగం ఉండేది. చెక్క ఫ్యాన్ తిప్పడమే
ఆయన పని. 1960, 70 కాలంలో వచ్చిన కొన్ని సినిమాల్లో ఈ చెక్క ఫ్యాన్ మనకు కనిపిస్తుంది. 1920లో తయారైన చెక్క ఫ్యాన్‌ను గంగాధరరావు ఢిల్లీ నుంచి సేకరించారు. ఇందుకోసం రూ.45 వేల వరకు ఖర్చు చేశారు.
కిరోసిన్ ఫ్యాన్: విద్యుత్ లేని కాలంలో కిరోసిన్ ఫ్యాన్ ఉపయోగించేవారు. కిరోసిన్ దీపం వెలిగితే చాలు ఆటోమేటిక్‌గా ఫ్యాన్ తిరుగుతుంది. జమిందార్లు, బ్రిటిషర్లు ఈ ఫ్యాన్‌ను ఎక్కువగా వినియోగించేవారు. ముంబయి నుంచి ఎనిమిదేళ్ల కిందట గంగధారరావు మాస్టర్ ఈ ఫ్యాన్‌ను సేకరించారు. ఇందు కోసం రూ.42 వేల వరకు ఖర్చు చేశారు.
భోజనం గిన్నెలు: అప్పటి రోజుల్లో ఐదున్నర కిలోల బరువు ఉన్న కంచు గిన్నెల్లో భోజనం చేసేవారు. వీటి తయారీ పద్ధతి కూడా చాలా అరుదైనది. రాగి, తగరం ముద్దలా చేసిన ఆరుగురు మనుషులు ఏకకాలంలో ఈ గిన్నెలను తయారు చేసేవారు. ఇలాంటివి గంగాధర మాస్టర్ వద్ద నాలుగు ఉన్నాయి. ఒడిశా, ఉత్తరాంధ్ర ప్రాంతం నుంచి వీటిని సేకరించారు.
గ్రామఫోన్ రికార్డులు: అలనాటి మధుర గీతాలు గ్రామఫోన్ రికార్డుల రూపంలో ఉండేవి. 1932 రామపాదుక పట్టాభిషేకం సినిమా రికార్డు మొదలు 1980 వరకు విడుదలైన సినిమాల వరకు పాటల రికార్డులను ఆయన సేకరించారు. ఘంటసాల, సుశీల, బాలసుబ్రహ్మణ్యం, ఏసుదాస్, జానకీ, మహ్మద్ రఫీ, ఆనంద్ తదితరులు పాడిన మధుర గేయాల రికార్డులు ఆయన వద్ద ఉన్నాయి. మొదటి ప్రధాని జవహర్లాల్ నెహ్రూ 1956లో అమెరికా వెళ్లినపుడు అక్కడ చేసిన ప్రసంగం, మహాత్మా గాంధీ, నేతాజీ సుభాష్ చంద్రబోస్ తదితరుల ప్రసంగాల రికార్డులను ఆయన భద్రపరిచారు. ఇలా ఆయన వద్ద 20 రకాల గ్రామఫోన్లు.. ఇందులో 100 ఏళ్లకు పైబడినవి 10, 60 ఏళ్లకు పైబడినవి 10 వరకు ఉంటాయి. 4 వేలకు పైగా మట్టి, ఎల్పీ, తదితర రికార్డులు ఉన్నాయి. ముఖ్యంగా హెచ్ఎంవీ కంపెనీ గ్రామఫోన్లు ఇక్కడ ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నాయి. కీ ఇస్తే రికార్డ్ ప్లే అయ్యే గ్రామఫోన్లు, ఎలక్ట్రానిక్ గ్రామ ఫోన్లు మనకు కనిపిస్తాయి. వెయ్యికి పైగా టేపు క్యాసెట్లు, బ్లాక్ అండ్ వైట్ టీవీలు, అప్పటి టెలీఫోన్లు, టైపు రైటర్లు, కత్తులు, కొరడాలు.. ఇలా ఎన్నో ఆపాత మధురాలు ఇక్కడ మనకు తారసపడతాయి. వీటన్నింటినీ అహ్మద్‌బాద్, ఢిల్లీ తదితర ప్రాంతాల నుంచి మాస్టర్ సేకరించారు.
పాన్దాన్స్(కిల్లీ డబ్బాలు): గంగాధర మాస్టర్ వద్ద 12 రకాల విభిన్న పాన్దాన్స్ ఉన్నాయి. ఇవన్నీ రాజుల కాలం నాటివే. ముఖ్యంగా నెమలి ఆకారంలోకి పాన్దాన్ ప్రత్యేక ఆకర్షణగా ఉంటుంది. వీటిని ఇప్పుడు తయారీ చేయాలంటే సాధ్యం కాదని మాస్టర్ చెబుతున్నారు. ఎందుకంటే నైపుణ్యత గల కళాకారులతో పాటు ప్రత్యేక పనిముట్లు కావాలని అంటున్నారు. వీటిని దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి సేకరించారు.
స్టీమ్ క్యారేజ్: సుమారు 10 కిలోల బరువుండే 1917లో తయారు చేసిన స్టీమ్ క్యారేజ్‌ను ఆయన సేకరించారు. ఇందులో భోజనం వండుకోవచ్చు. ఇందులో వండిన ఆహారం 10 నుంచి 12 గంటల పాటు వేడిగా ఉంటుంది. రాజస్థాన్‌లోని జైపూర్ నుంచి రూ.16 వేలు పెట్టి దీనిని తీసుకొచ్చారు.
ప్రెసర్ కుక్కర్ : 1919 నాటి రుక్మిణి ప్రెసర్ కుక్కర్ ఆయన సేకరణలో ఒకటి. ఇందులో ఎనిమిది పాత్రలు ఉంటాయి. ఒకేసారి అన్నం, కూరలు నేచురల్ ప్రెజర్ ద్వారా వండుకోవచ్చు. చెన్నై నుంచి రూ.12 వేలు పెట్టి దీనిని కోనుగోలు చేశారు. దీని బరువు 3 కిలోల పైనే ఉంటుంది. ఇదే మొదటి ఇండియన్ కుక్కర్ అని మాస్టర్ చెబుతున్నారు.
రేడియోలు: మొదటితరం నాటి 10 వరకు రేడియోలు ఈయన సేకరించారు. అప్పట్లో రేడియో వినియోగించాలంటే లైసెన్స్ పొందాలంటా? పోస్టాఫీస్‌కు వెళ్లి లైసెన్స్ తీసుకోవాలి. రెన్యూవల్ కూడా అక్కడే చేసుకోవాలి. ఆ లైసెన్స్ కాపీలు మాస్టర్ వద్ద ఉన్నాయి.
భారత రాజ్యాంగం : చేతిరాతతో రాసిన ప్రపంచంలో ప్రత్యేకత కలిగిన భారత రాజ్యాంగం కాపీ ఇక్కడ దర్శనమిస్తుంది. భారత రాజ్యాంగంలో 284 మంది మేధావులు సంతకాలు చేశారు. వీరిలో భారత ప్రథమ రాష్ట్రపతి బాబూ రాజేంద్రప్రసాద్, ప్రధాని జవహర్ నెహ్రూ, రాజ్యాంగ నిర్మాత బి.ఆర్.అంబేడ్కర్, పట్టాభి సీతారామయ్య వంటి ఎందరో మేధావులు ఉన్నారు. భారత రాజ్యాంగం అసలు కాపీని పార్లమెంట్ లైబ్రరీలో పాడవకుండా ప్రత్యేక జాగ్రత్తలతో భద్రపరిచారు. భారత రాజ్యాంగం నకళ్లను అప్పట్లో ప్రభుత్వం విడుదల చేసింది. అందులో ఓ కాపీని గంగధారరావు మాస్టారు సేకరించారు. 1758లో డచ్, ఇంగ్లిష్ వారి మధ్య ఆధిపత్య పోరు (యుద్ధం), తర్వాత విజయనగరం రాజా కోటలో సంధి.. ఈ వివరాలతో 1894 మద్రాస్‌లో విజయనగరం ట్రీటీ అనే బుక్ ముద్రించారు. దీనిపై ఆనందగజపతి రాజు సంతకం ఉంటుంది. ఈ అరుదైన బుక్‌ను మాస్టర్ సేకరించారు. అలాగే బ్రిటిష్ వారి గెజిట్స్, స్వాతంత్ర్య ఉద్యమం నాటి పోస్ట్‌కార్డ్స్, పేపర్లు ఆయన సేకరణలో మరికొన్ని..
ఇవేనా 60 వరకు కిరోసిన్ ల్యాంప్‌లు, పెట్రోమ్యాక్స్ లైట్లు, సైకిల్, రిక్షా లైసెన్స్‌లు, యానిమన్ లైసెన్స్‌లు, రైలు కుడి(ఒక గిన్నెల్లో 42 పాత్రలు), 1000 ఏళ్ల నాటి తాళ్ల పత్రాలు, ఘటాలు, కుట్టు మిషన్లు, డాక్యుమెంట్లు, డేకరేటివ్ ఇలా ఎన్నో ఐటమ్స్ ఇక్కడ కనిపిస్తాయి. అప్పట్లో ప్రతి ఆహార పదార్థం వంట చేయడానికి ఓ ప్రత్యేక పాత్ర ఉండేది. పాలు మరగబెట్టడానికి, వేడి నీరు, వంటకు చేయడానికి వేర్వేరుగా పాత్రలు ఉండేవి. వంశపారంపర్యంగా ఇలాంటి వస్తువులను ఇచ్చేవారు. ప్రస్తుతం పాతతరం వస్తువులను చూడాలంటే మ్యూజియంలకు వెళ్లాల్సిన పరిస్థితి ఉండేది. అలాంటి మ్యూజియం మన గంగధారరావు మాస్టర్ ఇల్లు. అంతలా ఆయన వస్తువులను సేకరించి భద్రపరిచారు.
సేకరణలో కష్టాలెన్నో..
గంగాధర మాస్టర్ ఎంతో శ్రమకోర్చి పురాతన వస్తువులు సేకరిస్తున్నారు. మొదట్లో ఫలాన వస్తువు ఫలాన చోట ఉంది అంటే ఉత్తరాలు రాసేవారు. తర్వాత ఫోన్లు రావడం, వాట్సాప్ గ్రూప్‌లు క్రియేట్ కావడం కొంత సులువైంది. ఫలాన చోట వస్తువు ఉందంటే ముందుగా డబ్బులు చెల్లిస్తే.. వారే ఇంటికి పంపిస్తున్నారు. ఇందులో కూడా పోటీ ఉంటుంది. ఒకసారి మిస్ అయితే ఆ వస్తువు మళ్లీ దొరకదు. అందుకే ఎంత కష్టమైన వెంటనే డబ్బులు చెల్లించి వస్తువు సేకరిస్తున్నారు. ఇందుకోసం ఆయన ప్రతి నెలా తనకు వచ్చే ఆదాయంలో 20 శాతం వరకు ఇందుకు ఖర్చు చేస్తున్నారు. ఈ 22 ఏళ్ల కాలంలో రూ.10 లక్షలకు పైనే ఖర్చు అయి ఉంటుందని చెబుతున్నారు. ఎందుకండి ఇంత ఖర్చు చేసి.. శ్రమ పడి.. ఇదంతా చేస్తున్నారు అంటే చిన్నగా ఓ చిరునవ్వు నవ్వేస్తారు. నేను సేకరించిన వస్తువులు చూసేందుకు చాలా మంది వస్తుంటారు. వాటి గురించి తెలుసుకుని.. వాటితో తమకున్న జ్ఞాపకాలు పంచుకుంటుంటే ఆ శ్రమంతా ఒక్కసారిగా మర్చిపోతానని అంటున్నారు. ఆయనకు ‘GR ANTIQUES’ అనే యూట్యూబ్ చానల్ ఉంది. ఈ చానల్‌కు 1.53 లక్షల మంది సబ్స్రైబర్లు ఉన్నారు. ఇన్‌స్టాలో దాదాపు లక్ష మంది మంది సభ్యులు ఉన్నారు. ఆయన సేకరించిన ప్రతి వస్తువు గురించి వీటిలో వివరిస్తుంటారు.
‘గోల్డ్ స్పాట్ అనే ఖాళీ సోడా గురించి చెబితే దాదాపు 5 లక్షల మంది చూశారు. 20 వేలకు పైగా కామెంట్లు వచ్చాయి. ఆ సీసాతో తమకున్న అనుభూతిని వారంతా పంచుకుంటూంటే నాకు ఎంతో సంతోషం అనిపించింది. లూనాపై వీడియో చేస్తే చాలా మంది మా దగ్గర కూడా లూనా ఉండేదండి.. నా నాన్న గారు లూనాపై నన్ను తిప్పారండి అంటూ కామెంట్లు చేస్తూ జ్ఞాపకాలు రీ కలెక్ట్ చేస్తుకుంటున్నారు. హైదరాబాద్, రాజమండ్రి, విజయవాడ తదితర ప్రాంతాల నుంచి ఈ వస్తువులు చూసేందుకు చాలా మంది వస్తున్నారు’ అని మాస్టర్ వివరించారు. యూట్యూబ్‌లో ఈయన పెట్టిన వీడియోలు చూసి చాలా మంది సినిమా డైరెక్టర్లు కూడా ఆయన్ని సంప్రదిస్తున్నారు. ఆయన సేకరించిన వస్తువులను సినిమాల్లో ఉపయోగించుకునేందుకు అడుగుతున్నారు.
మ్యూజియం ఏర్పాటే లక్ష్యం
పూర్వీకులు ఉపయోగించిన ప్రతి వస్తువును సేకరించి భద్రపర్చాలన్నదే నా లక్ష్యం. అప్పట్లో వాడిన ప్రతి వస్తువుకూ ఓ ప్రత్యేకత ఉంది. ఆ వస్తువుల్లో ఆరోగ్యం ఉండేది. ఇప్పటి వస్తువులన్నీ ప్లాస్టిక్, కాగిత, గాజుతో తయారవుతున్నాయి. పాతతరం ప్రాముఖ్యం, మన సంప్రదాయాలను తెలియజేయాలనే ఉద్దేశంతో 22 ఏళ్లుగా పూర్వపు కాలపు వస్తువులను సేకరిస్తున్నాను. ఇందు కోసం నెలవారీ జీతంలో కొంత మొత్తాన్ని వెచ్చిస్తున్నాను. ప్రస్తుతానికి ఇంటినే మ్యూజియంగా వినియోగిస్తున్నాను. ఆసక్తి ఉన్న వారు దూర ప్రాంతాల నుంచి వచ్చి.. వీటిని చూసి ప్రత్యేక అనుభూతిని పొందుతున్నారు. భవిష్యత్‌తో అందరికీ అందుబాటులో ఉండేలా విశాఖపట్నంలో ఓ మ్యూజియం ఏర్పాటు చేయాలన్నదే నా ఆకాంక్ష. ఇందుకు చాలా ఖర్చు అవుతుంది. ప్రభుత్వం, పారిశ్రామిక వర్గాలు సహకరిస్తే నా కల నెరవేరుతుంది.
- గంగాధరరావు, పరవాడ






